Saturday 24 September 2022

భైంసా పట్టణం చారిత్రక ప్రశస్తి

భైంసా పట్టణం చారిత్రక ప్రశస్తి
పరిచయం:
చరిత్ర ద్వారా మనం ఒక కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన తదితర అంశాలను మనం తెలుసుకోవచ్చు. అందుకు మనకు అనేక ఆధారాలు లభిస్తాయి. అవి కట్టడాల రూపంలో గానీ, నాణేల రూపంలో గానీ లేదా శాసనాల రూపంలో గానీ లేదా గ్రంథస్థరూపంలో లభించవచ్చు. ఒక ప్రాంత చరిత్రను మనం వీటిద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ప్రజలు తమ ప్రాంత చరిత్రను ఆశువుగా కథలు కథలుగా చెప్పుకుంటారు. చరిత్ర విద్యార్థులుగా ఒక ప్రాంతంను చారిత్రక కోణంలో పరిశీలిస్తే ఆ ప్రాంతంలో పూర్వికులు నివసించిన ఆనవాళ్ళు, వారు నిర్మించిన కట్టడాలు, వారు ఏర్పరచిన సంస్కృతి సాంప్రదాయాలు తర్వాతి తరాలకు వారసత్వంగా అందుతాయి.వీటిని పరిశోధించడం వలన మనం ఉంటున్న ప్రాంతచరిత్రను వెలికితీసి భావితరాలకు అందించవచ్చు.
తెలంగాణలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. శాతావాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహిలు, అసఫ్ జాహీలు ఇట్లా అనేక రాజవంశాలు తమ పాలనలో ఎన్నో ప్రాంతాలను చారిత్రకంగా ఉజ్వలమయం చేశారు. అయితే కొన్ని ప్రాంతాలు చారిత్రక ప్రశస్తికి నోచుకొని పర్యాటకమయంగా విరాజిల్లుతున్నాయి. అలాగే మరికొన్ని ప్రాంతాల గురించి ఎన్నో విషయాలు నేటికీ వెలుగుచూడలేదు.ఇట్లా వెలుగులోకి రాని ఒక ప్రాంతమే భైంసా.
భైంసా రెవెన్యూ డివిజన్ తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఉన్న ఒక ప్రాంతం. భైంసాకు పూర్వనామం "మహిషాపురం".కాలక్రమేణ మహిషా భైంసా గా పిలువబడుతున్నది. భైంసా పట్టణం యొక్క చారిత్రక ప్రశస్తి, దాని పేరు వెనుక గల చరిత్రను వెలికితీయడమే మా పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
పరికల్పన:
భైంసా మహిషాపురం అని పిలవబడిన చారిత్రక ఆనవాళ్ళు నేటికీ గట్టు మైసమ్మ గుడిలోనూ దానికి సమీపంలో పడి ఉన్న మహిషాసుర పాదాలలో కలవు. వాటి అధ్యయనంనూ చారిత్రక కోణంలో పరిశీలించి భైంసా పేరు వెనుక గల కథనాలు, చరిత్రను తెలియజెప్పడం.
ఉద్దేశ్యాలు:
1.భైంసా పట్టణం యొక్క భౌగోళిక మరియు చారిత్రక ఆనవాళ్ళను అధ్యయనం చేయడం
2.భైంసా లో ఉన్న మైసమ్మ గుట్ట గుడి మరియు మహిషాసుర పాదాల చారిత్రక ప్రశస్తిని వెలుగులోకి తేవడం
3.భైంసాలో గల ప్రాచీన కట్టడాలు, దేవాలయాలను గుర్తించడం
4.భైంసా పేరు వెనుక గల చారిత్రక ప్రాధాన్యాన్ని తెలుసుకోవడం
5. భైంసా లో గల సాంఘిక-మత పరిస్థితులను పరిశీలించడం
6. భైంసా లో గల పర్యాటక ప్రదేశాలు గుర్తించడం
పరిధి:
భైంసా పట్టణం యొక్క చారిత్రక ప్రశస్తిని అధ్యయనం చేయడమే మా పరిశోధన పరిధి. భైంసా ప్రాంతంలోని ప్రజల సంస్కృతి, సాంప్రదాయం, ఆహారపు అలవాట్లు, పండగలు, ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలను తెలుసుకోవడం.

భైంసా పట్టణం భౌగోళిక పరిస్థితులు:
భైంసా పట్టణం నిర్మల్ జిల్లా కేంద్రానికి 40 కి.మీ. దూరంలో ఉంది. ఇది పూర్వం ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది.భైంసా రెవెన్యూ డివిజన్ తో పాటు ఒక మున్సిపాలిటి.ఇది మహారాష్ట్ర బార్డర్ కు దగ్గరగ ఉన్న టౌను.భైంసాకు మహిషాపురం అనే పేరు ఉంది.నిజాం రాజ్య పతనం తర్వాత 1956 దాకా నాందేడ్ జిల్లాలో ఉన్న భైంసా 1956లో భాషాప్రయుక్తరాష్ట్రాల్లో భాగంగ మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో కల్సింది. ఈడ తెలుగుతో పాటు హింది, ఉర్దు, మరాఠి ఎక్కువ మాట్లాడ్తరు.ఇక్కడ పత్తిమిల్లులు ఎక్కువ కలవు. పత్తి,సోయ, వరి,మొక్కజొన్న పంటలు ఎక్కువగా పండిస్తారు. 2011జనాభా లెక్కల ప్రకారం భైంసా పట్టణ జనాభా దాదాపు 50 వేలు. భైంసా మునిసిపాలిటి 1934 లో ఏర్పడింది. 32 వార్డులు కలవు.
భైంసా పేరు వెనుక గల కథ:
భైంసాను పూర్వం మహిషాపురం అని పిలవడానికి గల ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం మహిషాసురుడనే రాక్షస రాజు ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురిచేసేవాడనీ, ప్రజలు విసిగిపోయి దుర్గామాతకు మొరపెట్టుకోగా విజయదశమి రోజున ఆమె మహిషాసురున్ని సంహరించి "మహిషాసురమర్థిని"గా ఈ ప్రాంతంలో కొలువై మైసమ్మ గుట్టపై గట్టు మైసమ్మగా వెలసిందని ప్రతీతి. ఇప్పటికీ మైసమ్మ గుట్టపై గుడి దాని సమీపంలో తెగిపడిన మహిషాసురుని రాతిపాదాలు కలవు.
గట్టు మైసమ్మ దేవాలయం:
మైసమ్మ గుట్టపై గట్టు మైసమ్మ దేవాలయం ఉంది. మహిషాసుర వధ అనంతరం "మహిషాసుర మర్థిని" అవతారంతో బోడ గుట్టపై గట్టు మైసమ్మ వెలిసింది.మైసమ్మ కోరిన కోరికలు తీర్చేతల్లి అని ఇక్కడి ప్రజల విశ్వాసం. ప్రజలు అనారోగ్యం బారినపడినప్పుడు, సంతానం లేనప్పుడు ఇక్కడి అమ్మవారిని పూజిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని నమ్మకం.
గట్టు మైసమ్మ దేవాలయం భైంసా బస్టాండ్ కు 3 కి.మీ. దూరంలో కుంట ఏరియాలో గుట్టపై కలదు.మొదట ఎత్తైన బోడ గుట్టపై అమ్మవారు ఉండేది తదనంతరం భక్తుల సౌకర్యార్థం అమ్మవారి విగ్రహాన్ని బోడగుట్ట కింది భాగంలో ప్రతిష్టించి ఆలయం నిర్మించారు.అప్పటినుండి భక్తులు సందర్శిస్తూ తమ కోరికలను ముడుపుల రూపంలో కడుతూ  తమ భక్తిని చాటుకుంటున్నారు. అలాగే భక్తులు బోనాలను అమ్మవారికి సమర్పిస్తారు.
మహిషాసుర పాదాలు:
పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు భైంసాలోని కొండలలో ఉంటూ చుట్టూ ప్రక్కల ప్రజల్ని అనేక బాధలకు గురిచేస్తూ ఉండడంతో ప్రజలు శక్తిమాత అయిన దుర్గామాతను వేడుకోవడంతో దుర్గమ్మ మహిషాసురుడిని సంహరించడంతో మహిషాసురపాదాలు తెగిపడినవని పురాణ కథనం కలదు. మైసమ్మ గుట్ట దగ్గరలో తెగిపడిన రాతిపాదాలు ఇప్పటికీ ఉన్నాయి.
ప్రాచీన కట్టడాలు:
1. గట్టుమైసమ్మ విగ్రహం:
గట్టు మైసమ్మ విగ్రహం అతిప్రాచీనమైంది. పురాణకాలంనుంచి ఇక్కడ గుట్టలలో ఉన్న ఈ విగ్రహం అనేక ఏండ్లుగా గుట్టల్లో దాగి ఉంది.పూర్వీకులు ఆ విగ్రహాన్ని గుర్తించి పూజలు ప్రారంభించారు. ఆ రాతి విగ్రహంపై నవనాగులు కలవు.అలాగే విగ్రహం వెనకాల పెద్ద జడ కలదు.
2.ఓంకారేశ్వర్ మహదేవ్ మందిర్:
ఓంకారేశ్వర్ మహదేవ్ మందిర్ సిద్దార్థనగర్ ఆవల చెరువు గట్టుపై ఉంది.ఇది అతి ప్రాచీనమైన గుడి.ఇక్కడి గుడిపై ఉన్న ఓ స్థంభంలో ప్రాచీనకాలం నాటి లిపిలో వివరాలు రాయబడిఉన్నవి. బహుశ పూర్వం శాతావాహనులకాలం అయి ఉండొచ్చు.ఇక్కడి గుడిలో రెండు గుడులు కలిసిఉన్నాయి. ఒక గుడిలో శివలింగం ఉంది.మరో గుడిలో దత్తాత్రేయ విగ్రహం కలదు. ఇక్కడ శివరాత్రి మరియు దత్తజయంతి సందర్భంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.ఈ గుడిలో 28 స్థంభాలు కలవు.ఈ ఆలయం ఒకే రాతితో చెక్కబడిఉంది.
ఈ ఆలయం ప్రక్కనగల చెరువు లో దాదాపు 40 దేవాలయాలు నిర్మించబడిఉండేవని తెలుస్తుంది. ఇవి నేడు లభించుటలేదు.చెరువు మధ్యలో విడిది చేయడానికి నిర్మాణాలు ఉండేవి. వాటి ఆనవాళ్ళు నేటికి కలవు.
3.దిగుడుబాయి:
పురాణ బజార్ లోని మహిమయి మాతా ఆలయప్రాంగణంలో పురాతనకాలంనాటి దిగుడుబావి కలదు.ఈ బాయి రాతితో నిర్మించబడింది.ఈ బావిలోనికి వెళ్ళేందుకు మెట్లు ఉన్నాయి.ఈ మెట్ల ప్రక్కన ఒక ధ్యానమందిరం కలదు.బావిలో నిండినటువంటి నీరు బయటకు రావడానికి రెండు నీటిద్వారాలు నిర్మించబడి ఉన్నవి.
4. కాలభైరవ విగ్రహం:
శనీశ్వర దేవాలయం పురాణ బజార్ లో ఉంది. ఇక్కడ అతిప్రాచీన కాలభైరవుడి విగ్రహం కలదు.కాలభైరవుడు శంకరుని అవతారం. కాలభైరవుడి విగ్రహం బండరాయితో చెక్కబడి ఉంది. ఇక్కడి ప్రజలు దీనిని శనీశ్వర మందిర్ గా భావించి రావడంతో 1967 లో ఇక్కడ నవ గ్రహాలను ప్రతిష్టించారు. ఇక్కడ శనివారం అమావాస్య రోజున భక్తులు తండోపతండాలుగా వస్తారు.
5.నర్సింహ్మాస్వామి దేవాలయం:
భైంసాలోని నర్సింహానగర్ లో నర్సింహ్మాస్వామి దేవాలయం కలదు. ఇక్కడ బండరాయితో తొలచిన నర్సింహ్మాస్వామి విగ్రహం అలాగే మందిరం కలదు.

భైంసా పండుగలు:
1.ఎడ్ల పొలాలు:
భైంసా ప్రాంతంలో పొలాల అమావాస్య ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయంలో ముఖ్యమైన పండుగ. దీనినే "ఎడ్ల పొలాలు" అని అంటరు. ఇది రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయంలో ఉపయోగించే ఎడ్లను పూజించటమే దీని ప్రత్యేకత. భైంసా వాసులు వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తరు.ఇక్కడ పత్తి, సోయలు, మినుములు ఎక్కువగా పండిస్తరు.
ఈ పండుగ అమావాస్యకు ముందురోజు ప్రారంభమైనా కోలాహలం మాత్రం వారం ముందనుంచే ఉంటది.పండుగ ముందురోజు సాయంత్రం చాటగుల్లలో దోసకాయ, మొక్కజొన్న లు వేసి వాటికి ఉప్పును కలిపి ఎడ్లకు, ఆవులకు,లేగలకు పెడతారు.ఇక హారతి సరేసరి.ఈ విధంగా చేయడాన్ని ఉప్పులు అంటారు.
ఇక అమావాస్య రోజు ఉదయాన్నే లేసి కల్లాపిజల్లి ముగ్గులు పెడతారు. గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు.ఇంటి పరిసర ప్రాంతంలో, పశువుల కొట్టంలో మొరం వేసి చదును చేస్తారు.గడప దగ్గర మోదుగ కొమ్మ టేకు కొమ్మ ఉంచుతారు. ఇక ఇంటిల్లిపాది స్నానాలు ఆచరించి పూజగదిని అలంకరించి దీపారాధన చేస్తారు. కుమ్మరి వారి ఇంటికి వెళ్ళి మట్టితో చేసిన ఎడ్ల ప్రతిమలు తెచ్చుకుంటరు.వాటికి రంగులు వేస్తరు. లేదంటే గాంధీ గంజ్ లో రెడీమేడ్ గ దొరికేవి కొనుగోలు చేస్తరు.జత ఎడ్లు,ఒక ఆవు,ఒక లేగ బొమ్మలు కొంటరు. వాటిని తెచ్చి పూజగదిలో ఉంచి పూజ చేస్తరు.
ఇక ఎడ్లకు స్నానంబోసి కొమ్ములకు రంగులు వేస్తరు.అట్నే అంగట్లో తెచ్చిన ఎడ్ల అలంకరణ సామాగ్రి కొత్తపగ్గం, బెల్టు, గోండలు, నార మొదలగునవి వేస్తరు.రంగురంగుల వస్త్రం మీద వేస్తరు. రంగులు చల్లుతరు. సాయంత్రం నేతాజినగర్ లోని హనుమాన్ల గుడి దగ్గరకు డప్పుచప్పుళ్ళతో జనాల కోలాహలంతో ఊరేగింపుగా ఎడ్లను తోలుకొని వస్తరు.
పాండ్రిగల్లి దగ్గర నుంచి తిర్ణాల్ల జాతరలెక్క ఉంటది. అక్కడ రావిచెట్టు దగ్గర నేతాజి యువజన సంఘం ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటుజేస్తారు. ఎడ్లకు హారతి ఇచ్చిన ఒకతను ముందు కాగడా పట్టుకొని నడుస్తుండగా ఆ వెంటనే రైతులు తమ అలంకరించిన ఎడ్లను రోకడ్ హనుమాన్ల గుడి చుట్టూ తిప్పుతారు. చేతిలోని అక్షింతలను ఎడ్లపై వేసి సల్లంగా ఉండాలని దీవిస్తారు. గుడి చుట్టూ తిరిగినంక రైతులు ఎడ్లను తమ ఇంటికి తోలుకపోయి హారతిచ్చి ఆకులో నైవేద్యం సమర్పిస్తరు.ఈ పండుగకు పిండివంటలుగా పోలాలు, కుడుములు వంటివి చేస్తరు.ఇంటిల్లిపాది టేకు ఆకులోనే లేదంటే మోదుగ ఆకుతో కుట్టిన విస్తర్లలోనో భోజనం చేస్తరు.ప్రకృతిని పూజించడం తమకు ఉపయోగపడే పశువులను పూజించడం, పండుగ చేయడం ఇక్కడి జనాల సంస్కృతిలో అంతర్భాగం.
2.గణేషుల పండగ:
గణపతి ఉత్సవాలు భైంస సంస్కృతిలో భాగం.తొమ్మిది దినాలు ఏడ చూసిన పండగ వాతావరణమే కన్పిస్తది.అందరు పూజలు,పునస్కారాలతో భక్తిపారవశ్యంలో పరవశులవుతారు. బండారిలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఏడ చూసినా కోలాహలం ఉంటుంది ప్రతి గణపతి మండపం వద్ద లడ్డు, కండువ, ఖాతా రోకడ్ బుక్ ఉంచుతారు.
 గణేష్ నిమజ్జనం చాలా భారిఎత్తిన చేస్తారు.వివిధ వాహనాలపై కొలువుదీరిన గణేషులు డప్పుచప్పుళ్ళు, బ్యాండ్ వాయిద్యాలు, డిజె హోరులతో ఊరేగింపుగ రావడంతో వాటిని చూసేందుకు వీధులనిండా ఇసుకేస్తే రాలనంత జనం చుట్టు ప్రక్కల ఊర్లలనుండి వస్తారు. ఒకవైపు బండారలు, ప్రసాదాలు, పలిహోరల పంపిణి.మరోవైపు కోలాటాలు, డప్పునృత్యాలు, కళాకారుల పాటలు, డిజె నృత్యాలతో కన్నులపండువగ ఉంటుంది. భైంసాలోని అన్నీ వీధులగుండా ఊరేగింపుగా గణపతులను తీసుకెళ్ళి గడ్డన్న వాగులో నిమజ్జనం చేస్తారు.
3. దేవి నవరాత్రి ఉత్సవాలు:
దసరా పండుగ సందర్భంలో దుర్గామాతలు ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. దుర్గామాత "మహిషాసుర మర్థిని"గా గట్టు మైసమ్మగా ఇక్కడ వెలియడంతో దేవినవరాత్రి ఉత్సవాలకు భైంసా సంస్కృతి లో ప్రాధాన్యత ఉంది.
4. బోనాలు:
"బోనం" అంటే భోజనం. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి లో అంతర్భాగం. ప్రజలు బోనాలను మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ తదితర దేవతలకు సమర్పిస్తారు.
5. బతుకమ్మ:
బతుకమ్మ పండుగ పూల పండుగ. మహాలయ అమావాస్యనాడు ఎంగిలిపూల బతుకమ్మగా మొదలై తొమ్మిదిరోజులపాటు కొనసాగి సద్దుల బతుకమ్మ తో ముగుస్తది. బతుకమ్మ పండగ తెలంగాణ లో మాత్రమే కనిపించే ప్రత్యేక పండుగ. బతుకమ్మ పండుగ కు ముందు పిల్లలు ఆడే బతుకమ్మను బొడ్డెమ్మ అంటారు.
సాంఘిక-మత పరిస్థితులు:
భైంసా లో హిందూ ముస్లిం సంస్కృతి కనిపిస్తుంది. కొంచాల గుట్టపై జరిగే ఉర్సులో ముస్లింలతోపాటు హిందువులు కూడా పాల్గొంటారు. ప్రజలు అనేక కుల వృత్తులతో పాటు, వ్యవసాయం, పత్తిమిల్లులలో పనిచేస్తారు. సంస్కృతి సాంప్రదాయాలపరంగా మహారాష్ట్ర సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. కొంతమంది బౌద్దమతాన్ని కూడా పాటిస్తున్నారు.
ఉపసంహారం:
భైంసా లో పురాణ బజార్ లో ప్రాచీన కట్టడాల ఆనవాళ్ళు, గట్టు మైసమ్మ, మహిషాసుర రాతిపాదాలు, అనేక ప్రాచీన దేవాలయాలు కలవు. వీటన్నింటి చరిత్రను భవిష్యత్ తరాలకు అందిచాల్సి ఉంది. అలాగే వీటిని ప్రముఖ పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలి. ప్రతీ ప్రాచీన కట్టడం గురించి పూర్తిస్థాయిలో పరిశోధన చేసి ఎన్నో విషయాలను వెలికితీసి గ్రంథస్థం చేయాల్సి ఉంది.

No comments:

Post a Comment