Saturday 24 September 2022

haritham

  "తెలంగాణకు హరితహారం" పథకం అమలు- విశ్లేషణ
ఉపోద్ఘాతం:
నేడు ఆధునిక మానవుడు తన మేధస్సుతో సాంకేతికంగా ఒకవైపు వినూత్న వస్తువులు సృష్టిస్తూ మరోవైపు సహజ వనరుల విధ్వంసానికి కారణమవుతున్నాడు. విలాసవంత జీవనంకై పట్టణీకరణకు ప్రాధాన్యతనివ్వడంతో క్రమంగా అటవీ విస్తర్ణం తగ్గిపోయింది. దీని వలన వాతావరణంలో పెనుమార్పులు సంభవించి భూతాపం పెరగడం, జీవ వైవిధ్యం కనుమరుగవడం వంటి సమస్యలు మానవాళి మనుగడకు ముప్పువాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది. "వృక్షో రక్షతి రక్షతః" అన్నట్లు పచ్చదనం పరిఢవిల్లేలా కృషిచేయడం వల్లనే ఈ పెను ప్రమాదాన్ని ఎదుర్కోగలం. ఇలాంటి తరుణంలో "తెలంగాణకు హరితహారం" వంటి పథకం ఓ బృహత్తర యజ్ఞంగా చెప్పవచ్చు.
రోజు రోజుకు తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం వలన వర్షాభావ పరిస్థితులు, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, జంతువులకు తలదాచుకునే చోటు లేకపోవడం వంటి వాటిని నివారించేందుకు "తెలంగాణకు హరితహారం" తోడ్పడుతుంది. విరివిగా మొక్కలు నాటడం వలన పర్యావరణ సమతుల్యత సాధించగలం. ప్రస్తుత తరుణంలో ఇలాంటి హరిత కార్యక్రమాల వల్లనే గ్లోబల్ వార్మింగ్, హరితగృహ ప్రభావం, ఓజోన్ పొర దెబ్బతినడం వంటి వాటిని నివారించి భవిష్యత్తు తరాలకు పర్యావరణ హిత భూగోళంను కానుకగా ఇచ్చేందుకు వీలుంటుంది. కావున ప్రపంచమంతటా భూమిపై పచ్చదనాన్ని కాపాడుకునేందుకు తగు చర్యలు తీసుకుంటూ ప్రణాళిక బద్ధంగా హరిత పృథ్విని సాధించాల్సిన అవసరం ఉంది.
"తెలంగాణకు హరితహారం పథకం: రూపకల్పన
ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ హౌజ్ గ్యాసెస్ తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. అనేక దేశాలు ప్రపంచ దేశాల్లో ఈ కార్యక్రమాల కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాయి. అన్ని దేశాలు భూగోళంపై ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రీన్ కవర్ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ప్రజలందరి భాగస్వామ్యంతో జరగాలి. తెలంగాణలో 24 శాతం అడవి ఉంది. 33 శాతం అడవి ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో అడవి ఎక్కువ ఉంది. మరికొన్ని చోట్ల అడవి లేదు. సమతుల్యం అవసరం. రిజర్వు ఫారెస్టులలో కూడా అడవి లేదు. చెట్లు లేవు. దీనికి చాలా కారణాలున్నాయి. అడవి జీవితంలో భాగంగా ఉండేది. తర్వాత పరిస్థితి మారింది. నగరీకరణ, పట్టణీకరణ పెరిగింది. లెక్కల్లో 24 శాతం అడవి ఉన్నట్లు తేలుతున్నా, వాస్తవంగా అంతకన్నా తక్కువ అడవి ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో కూడా మూడు, నాలుగు మీటర్ల చెట్టు లేవు. అందుకోసం 27 లక్షల హెక్టార్ల అటవీ భూమిలో విరివిగా చెట్లు పెంచాలి. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. అటవీ ప్రాంతంలో రూట్ స్టాక్ గుర్తించి, చెట్లు పెంచాలి. రూట్ స్టాక్ లేని చోట కొత్తగా మొక్కలు నాటాలి. ప్రజల భాగస్వామ్యంతో హరిత హారం కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
తెలంగాణలో గ్రీన్‌ కవర్‌ పెంచాలని ‘తెలంగాణకు హరితహారం’ అనే పథకానికి ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు రూపకల్పన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 40 లక్షల మొక్కలు పెంచు తున్నారు. ఇందుకోసం గ్రామాలలోనే నర్సరీలు ఏర్పాటు చేశారు. ఈ జూలై రెండవవారంలో నాటడానికి నర్సరిలో మొక్కలు సిద్ధమయ్యాయి. వచ్చే రెండేళ్ల ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం మొక్కల పెంపకం చేపడుతున్నారు. జూలై రెండవ వారంలో ‘హరితహారం వారోత్సవం’ నిర్వహిస్తారు.
కార్యాచరణ:
తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చే అధికారికంగా ప్రారంభించబడింది.అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన 15.86 లక్షల మొక్కలను నాటడం జరిగింది.
రెండవ విడత హరితహారం కార్యక్రమం జూలై 8, 2016న రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో జూలై 8న మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ దశలో 46 కోట్ల మొక్కలు నాటి లక్ష్యాన్ని చేరుకున్నారు.



హరితహారం పథకం ఉద్దేశ్యాలు :
1. తెలంగాణలో ఉన్న 24 శాతం అటవీ ప్రాంతంలో నూటికి నూరు శాతం అడవులు పెంచడం
2. పట్టణాలు, గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున సామాజిక అడవుల పెంపకం
3. తెలంగాణ వ్యాప్తంగా ఐదేళ్ల కాలంలో 230 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం
4. అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలు, హైదరాబాద్ నగర పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటడం
5. సహజసిద్ధమైన అడవులను పరిరక్షించడం, పునరుజ్జీవింపచేయడం
6. అటవీ భూముల దురాక్రమణను అడ్డుకోవడం
7. పెద్ద ఎత్తున సాగే వృక్షాల నరికివేతను నిలువరించడం
8. సామాజిక అడవుల పెంపకానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టడం
9. ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టడం.
పట్టుబట్టి, జట్టుకట్టి హరితహారాన్ని విజయవంతం చేద్దాం..! – కే.సీ.ఆర్ ఉద్ఘాటన
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తి తో ఇప్పుడు పట్టుబట్టి, జట్టుకట్టి రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హరితహారం విజయవంతం చేసి వానలను తిరిగి రప్పించుకోవాలన్నారు. వానలు హరితవనాల వల్ల వస్తాయి కానీ డబ్బులు పెట్టి కొనలేమన్నారు. కోట్ల రూపాయలు వెదజల్లినా వానలు రావన్నారు. అందువల్ల వనాలు పెంచితేనే వర్షాలు వస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరగాలన్నారు. నల్లగొండ జిల్లాలో 5.9 శాతం మాత్రమే అడవులు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అతితక్కువ అడువులు ఉన్న జిల్లా నల్లగొండ జిల్లా మాత్రమేనన్నారు. ఈ జిల్లాలో అడవుల శాతం పెంచడానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్టిన మొక్కలు వందశాతం బతికించాలన్నారు. అడవులు నశించడంతో అడవుల్లో ఉండే కోతులు గ్రామాలపై పడి అల్లరల్లరి చేస్తున్నాయన్నారు. కోతులు ఊళ్ళో నుంచి పోవాలంటే అడవులు పెరగాలన్నారు. గతంలో ఉన్న అడవులను మనం విచక్షణారహితంగా కొట్టివేయడంతో కోతులకు అడవుల్లో ఆహారం కరువైందన్నారు.
అడవుల్లో ఒకప్పుడు రకరకాల పండ్లు తునికి, రేగి, ఉసిరి, మేడి ఇలా ఎన్నొ జాతుల పండ్లు ఉండేవి. వాటిని తిని కోతులు కడుపునింపుకునేవన్నారు. అడవిలో చెట్లు కొట్టివేతలకు గురికావడంతో పండ్లు కరువై అవి తమ కడుపు నింపుకోవడానికి గ్రామాలపై పడుతున్నాయన్నారు. ఏ ఊరుకు వెళ్ళినా కోతుల బెడద గురించి రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. మనం ఆంజనేయస్వామిగా కొలిచే కోతుల సమస్య జటిలం కాకుండా ఉండాలంటే అడవులు పెరగాలన్నారు. గత సంవత్సరం వర్షాలు లేక కరువు ఏర్పడిందన్నారు. వర్షాలు పడాలంటే అడవులు, పచ్చదనం ఎంతో ముఖ్యమన్నారు. అందుకై మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపుచేయడం ఒక్కటే మార్గమన్నారు.
మన ఇంటిని మనమే బాగుచేసుకోవాలని, ఎవ్వరు వచ్చి బాగుచేయరని గుర్తెరగాలన్నారు. ఈ పదిరోజులు పాఠశాల విద్యార్థి నుంచి సీఎం వరకు 24గంటలు ఈ పనిలోనే ఉండాలని పిలుపునిచ్చారు. చెట్లు పెంచుకోవడమంటే మనల్ని మనం బాగుచేసుకోవడమే అన్నారు. అడవులు ఉన్న చోటనే వర్షాలు పడుతున్నాయని, చెరువులు నిండి అలుగులు పారుతున్నాయన్నారు. దీన్ని గ్రహించి తమ తమ ప్రాంతాలలో వానలు పడాలంటే చెట్లు పెంచాలనే ద్యాస కలిగి ఉండాలన్నారు. హరితహారంపై ప్రజల్లో చైతన్యం తేవడానికి కవులు పాటలు రాయాలని, గాయకులు గళం విప్పాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లో: రాజధాని హైదరాబాద్‌లో జూలై 10న ఒకేరోజు 29లక్షల మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌తో పాటు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, మేయర్‌ బొంతు రాంమోహన్‌ పలుచోట్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ హరితహారాన్ని ప్రజా ఉద్యమంలా నడిపించాలని అన్నారు. తరగిపోతున్న అడవులు వాతావరణంలో మార్పులకు కారణమన్నారు. అందుకే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. పండ్ల మొక్కలు పెంచితే జీవనోపాధి కూడా కలుగుతుందని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా చూడాలని ప్రజలను కోరారు.
హరిత హారం – ముఖ్యమంత్రి మనోగతం
తెలంగాణ ముద్దు బిడ్డలకు హరితాభివందనాలు…
తెలంగాణకు హరితహారం ఒక అపూర్వమైన కార్యక్రమం భారత దేశ చరిత్రలో తెలంగాణ లిఖిస్తున్న ఆకుపచ్చని అధ్యాయం. ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగాలి. ప్రతి పౌరుడు మొక్కలు నాటి పచ్చదనం కోసం పాటు పడాలి. పట్టుబట్టి జట్టు కట్టి ఎట్లనైతే తెలంగాణను సాధించుకున్నామో అట్లనే కోట్లాది మొక్కలు నాటాలె. ఆకుపచ్చని తెలంగాణను ఆవిష్కరించాలె.

మనిషి లేకున్నా చెట్టూ చేమ మనుగడ సాగిస్తాయి. కానీ చెట్లు లేకుంటే మనిషి బతుకు ఎడారే. విస్తారమైన అటవీ సంపద తెలంగాణకు ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. ఉష్ణోగ్రతలు పెరుగకుండా చేసేవి, అతివృష్టి, అనావృష్టిలతో కాలం తప్పకుండా కాపాడేవి చెట్లే. వరదలు వచ్చినప్పుడు నేల కోతకు గురికాకుండా నిలబెట్టేవి చెట్లే. ఒక్క మనిషికే కాదు సకల జీవరాశి మనుగడకు వృక్ష సంపదే మూలం. పుట్టిన నాడు ఊపే ఊయల నుంచి మరణించిన నాడు పేర్చే చితి దాకా మానవ జీవితం చెట్టుతో ముడిపడి వుంది. ఒక చెట్టు నలుగురు మనుషులకు సరిపోయే ప్రాణవాయువునందిస్తుంది. ఒక టన్ను కార్చన్‌ డై అక్సైడ్‌ను తగ్గిస్తుతుంది. క్షమించరాని మానవ తప్పిదాల వల్లనైతేనేమి, అవసరాలు, అనివార్యతల వల్లనైతేనేమి విచక్షణారహితంగా మనం అడవులను నరికివేస్తున్నాం ఫలితంగా తీవ్రమైన ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తాయి. భరించలేనంత స్థాయికి ఉష్ణోగ్రత పెరుగుతున్నది. అన్ని కాలాలు ఎండాకాలాలైపోతున్నయి. వర్షాలు లేక వరుస కరువులు వస్తున్నాయి. దీంతో పాటు ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించేందుకు పచ్చదనం పట్ల ప్రజల్లో సోయి పెంచేందుకు, కోట్లాది మొక్కలు నాటేందుకు రూపొందించిన మహత్తర పథకమే తెలంగాణకు హరితహారం. వనం వుంటేనే వానలు ఉంటయి. పైసలు పెట్టి కొనేటందుకు వానలు మార్కెట్లో దొరకవు. ప్రకృతి ఇచ్చే వరం వానలు. చెట్లు నాటితే చెట్ల గాలితో మబ్బులు చల్లపడి వానలు కురుస్తయి. మనం మన అవసరాల పేరుతో అడివి మీద పడుతున్నాం. అడవిలో కోతులు ఊర్లమీద పడుతున్నయి. పంటలను, పండ్ల తోటలను నాశనం చేస్తున్న కోతులు ఇప్పుడు మనకు పెద్ద సమస్య. ఈ సమస్యకు పరిష్కారం వనాలను పునరుద్ధరించడమే. అందుకే ఇప్పుడు మన నినాదం వానలు వాపస్‌ రావాలె… కోతులు అడవికి పోవాలె… ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలో ఎక్కడైతే అడవి వుందో అక్కడనే వానలు పడ్డయి. ఈ పరిస్థితిని గమనించి అందరం అడవులను సంరక్షించడానికి చెట్లను నాటటానికి నడుం కట్టాలె.

తెలంగాణకు హరిత హారం ద్విముఖ వ్యూహంతో సాగే కార్యక్రమం.
1) సహజసిద్ధమైన అడవులను పరిరక్షించడం, పునరుజ్జీవింపచేయడం. అటవీ భూముల దురాక్రమణను అడ్డుకోవడం. పెద్ద ఎత్తున సాగే వృక్షాల నరికివేతను నిలువరించడం.
2) ఇదే సమయంలో దీనికి సమాంతరంగా సామాజిక అడవుల పెంపకానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టడం. ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టడం.
కార్యక్రమ ప్రణాళిక:
--వచ్చే నాలుగేళ్ల పాటు హరిత హారం కార్యక్రమం నిర్వహించాలి. ప్రతి ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలి. ఇజిఎస్ తో అనుసంధానం చేస్తారు. నర్సరీల సంఖ్య బాగా పెంచాలి. వ్యవసాయ, రెవిన్యు, పంచాయతిరాజ్ అధికారులతో సమన్వయం కుదుర్చుకోని కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు.
--వాటర్ గ్రిడ్ కార్యక్రమంతో నీటికి కూడా కొరత ఉండదు. రిజర్వాయర్ల దగ్గర ఎక్కువ విస్తీర్ణంలో నర్సరీలు పెట్టాలి. జిల్లాల్లో ఉండే డ్యామ్లను వాడుకోవాలి. ఆ నీటిని మొక్కలకు వాడాలి.
-- ప్రతీ ఏడు జులై రెండవ వారంలో హరిత హారం కార్యక్రమం నిర్వహించాలి. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని రక్షించడమూ అంతే ముఖ్యం. ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, రైస్ మిల్లులు, విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, వైద్య శాలలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలి. రోడ్డుకు ఇరువైపులా చెట్లను పెంచాలి. ఎండా కాలంలో మొక్కలు కాపాడటానికి ఐదారు కిలోమీటర్లకు ఒక బోరు వేయాలి.
-- మొక్కలు నాటడం ఉద్యమంలా సాగాలి. హరిత దళాలు తయారు కావాలి.
-- తెలంగాణ భూభాగంలో 33శాతం అడవి వుండి తీరాలి. చెరువులో నీళ్ల చుట్టూ చెట్లు పెంచాలి.
-- అడవిని రక్షించే విషయంలో అటవీశాఖ అధికారులకు అవసరమైన భద్రత కల్పిస్తాం. స్మగ్లర్లు, అగ్నిప్రమాదాలు, కబ్జాల వల్ల అడవి అంతరిస్తోంది. ఈ విషయంలో దృష్టి కేంద్రీకరించాలి. అటవీశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలి.
-- రెవెన్యూ, అటవీశాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి, అటవీ భూముల హద్దులు నిర్ణయించాలి. ఒక ఇంచు అటవీ భూమి కూడా పోవద్దు. కలప స్మగ్లర్లు, అటవీ భూములను కబ్జా చేసే వారిపై పిడి యాక్టు ప్రయోగించాలి. అటవీ సిబ్బందికి వాహనాలు సమకూరుస్తారు. ప్రతి కన్సర్వేటర్ వద్ద రూ.20 లక్షలు, ప్రతీ డిఎఫ్ఓ వద్ద రూ.10 లక్షలు అటవీ సంరక్షణ కోసం అప్పటికప్పుడు ఖర్చు పెట్టడానికి నిధులు ఇస్తారు. డిఎఫ్ఓలకు జీపులు, ఫారెస్టర్లకు మోటార్ సైకిళ్లు కొనిస్తారు.
-- హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో మొక్కలు కాపాడడానికి ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలి. స్మశాన వాటికలు, బరేల్ గ్రౌండ్స్ లాంటి చోట్ల కూడా మొక్కలు నాటాలి.
-- అన్ని జిల్లాల్లో కలెక్టర్లు నర్సరీలను పరిశీలించాలి. అటవీ ప్రాంతాల్లో, జనావాస ప్రాంతాలకు సమీపంలో కోతులు తినే పండ్ల చెట్లు పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
-- హరితహారం కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో సాగాలి. కలెక్టర్లు సమన్వయం చేయాలి. ప్రచారం కోసం పోస్టర్లు, పాటలు, టి షర్ట్స్, బ్యాడ్జీలు, టోపీలు వాడాలి. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, పాటల పోటీలు నిర్వహిస్తారు.
-- ప్రహరి గోడలున్న ప్రాంగణాల్లో ఎనిమల్ ట్రాప్స్ ఏర్పాటు చేయనున్నారు.
-- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటాలి. ప్రతి నియోజకవర్గంలో 100 గ్రామాల్లో 40 వేల చొప్పున మొక్కలు నాటాలి. రైతులను భాగస్వాములను చేసి మామిడి, చింత, టేకు లాంటి పండ్ల చెట్లు, నీడ చెట్లు పెంచాలి.
-- కలెక్టర్లు ప్రతి వారం హరిత హారంపై సమీక్ష నిర్వహించడం జరుగుతుంది.
-- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల కండువాలు, టోపీలు అందించనున్నారు.
-- ప్రజా ప్రతినిధులను కలుపుకు పోవాలి. ఎవరికి వారు శ్రమదానంతో మొక్కలు నాటాలి.
-- బలహీన వర్గాల కాలనీల్లో ఇంటికి రెండు, మూడు పండ్ల చెట్లు పెంచాలి.
-- అటవీ భూములు కబ్జా చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. కబ్జా భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఈ విషయంలో బాగా పనిచేసిన వారికి అవార్డులు, పదోన్నతులు కల్పిస్తాం.
-- గ్రామ హరిత రక్షణ కమిటీలు నియమించాలి.
-- “హరితం శివం సుదరం” అనే భావన రావాలి.



హరితహారం-అమలు:
ఈ పథకం ను విజయవంతంగా అమలుచేయడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది.
1)గ్రామ హరిత రక్షణ కమిటీల ద్వారా మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చెపట్టడం జరిగింది.
2)ఎక్కువ మొక్కలు నాటేవారికి ప్రోత్సహకాలను ప్రకటించడం జరిగింది.
3)లక్ష్యాన్ని మించి మొక్కలు నాటే గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు రూ.2 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రోత్సాహకాలను అందజేస్తారు.
4)ఖాళీ స్థలాలు గుర్తించి విరివిగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకున్నారు.
5)రహదారులకు ఇరువైపులా హరిత పందిరి నిర్మించేలా ప్రణాళికలు రచించారు.
6)ప్రజలు,విద్యార్థులు,విద్యాసంస్థలు,అధికారుల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన చేశారు.
7)మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల భాగస్వామ్యంతో విరివిగా మొక్కలు పెంచేలా నిర్ణయించారు.
8)మిషన్ కాకతీయ పథకం లో పూడిక తీసిన చెఱువు గట్లపై ఈత, తాటి చెట్లు విరివిగా నాటేలా డ్వామాకు బాధ్యతలు అప్పగించారు.
హరితహారం పథకం అమలు - విశ్లేషణ ప్రాజెక్టు లక్ష్యాలు:
1."తెలంగాణకు హరితహారం" పథకం అమలు తీరుతెన్నులు పరిశీలించడం
2.హరిత తెలంగాణ సాధనలో "తెలంగాణకు హరితహారం" అందించే తోడ్పాటును విశ్లేషించడం
3.పర్యావరణ కాలుష్య నివారణలో "హరితహారం" పాత్ర తెలుసుకోవడం
4.హరితహారం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడం
5.హరితహారం అమలులో గల సమస్యలను పరిశీలించడం.


తెలంగాణా హరిత హారం పథకం విశ్లేషణ:
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పచ్చబడి పశుపక్ష్యాదులతో, జీవరాశులతో కలకలలాడాలని "తెలంగాణకు హరితహారం" పథకంను ప్రారంభించడం ముదావహం.ఈ కార్యక్రమం పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాల్లో ప్రపంచంలో మూడవ అతిపెద్దది చరిత్ర పుటల్లోకి ఎక్కింది.
ఈ పథకం అమలు తీరుతెన్నులు పరిశీలించినట్లయితే ప్రణాళికబద్ధంగా సాగుతోంది. ఈ పథకం ప్రారంభించిన మొదటి ఏడాది వానలు సరిగా పడకపోవడం వలన 40 కోట్ల మొక్కల లక్ష్యంలో కేవలం 15.86 కోట్ల మొక్కలనే నాటడం జరిగింది. అదే మలివిడతలో (2016) విస్తారంగా వర్షాలు కురవడంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకొంది. ఇది ప్రభుత్వ కార్యక్రమం గా మొదలై ప్రజాఉద్యమంలా సాగింది.
హరితహారం లో విస్తృతంగా మొక్కలు నాటడం వలన ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు పడేందుకు దోహదం చేసింది.అటవీ విస్తీర్ణం క్రమేణ పెరుగుతున్నట్లు ఇటీవల సర్వేల ద్వారా తెలుస్తుంది. హరిత తెలంగాణ సాధించేందుకు హరితహారం గొప్ప చోదకంగా పనిచేస్తుంది.ఇలాగే రానున్న దశల్లో విరిగా మొక్కలను నొటి సంరక్షించడం ద్వారా తెలంగాణ అంతటా హరితశోభతో వికసిస్తది.
కాలుష్యం ను నివారిస్తూ పర్యావరణ సమతుల్యత కాపాడేందుకు హరితహారం గొప్ప ఆశాకిరణం. వాహనాలు ఇతర పరిశ్రమల ద్వారా విడదలైన కాలుష్య వాయువులను చెట్లు పీల్చుకొని మనకు ప్రాణవాయువును ఇస్తాయి. అడవుల నరికివేత వలన జీవులు జనావాసంలోకి రావడం, ఆహారపు గొలుసు దెబ్బతినడం, జీవవైవిధ్యం కనుమరుగవడం వంటివాటిని హరితహారం వంటి కార్యక్రమాల వల్ల నివారించి పర్యావరణ సమతుల్యత సాధించగలం.
హరితహారం వలన కలిగే ప్రయోజనాలు:
1. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణం లో జీవించేందుకు దోహదపడుతుంది.
2. ప్రమాద స్థితి లో ఉన్న జీవులను పరిరక్షించేందుకు వనాల పెంపు అవశ్యం
3. కాలుష్యం ను నివారించవచ్చు
4.రుతుపవనాలు సరైన సమయంలో వచ్చేందుకు దోహదపడును.
5.భూతాపాన్ని నివారించవచ్చు
6.తెలంగాణ వ్యాప్తంగా అటవీవిస్తీర్ణం పెరిగి జీవుల జీవనప్రమాణాలు పెరుగుతాయి.
ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
హరితహారం పథకం అమలు లో గల సమస్యలు:
మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. ట్రీ గార్డ్ లు ఏర్పాటు చేయాలి. లేకుంటే హరిత తెలంగాణ సాధ్యం కాదు. అలాగే వర్షాలు పడని సందర్భంలో మొక్కలకు విరివిగా నీరు అందేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కొద్ది రోజుల కార్యక్రమంలా కాకుండా నిరంతరాయంగా ముందుకు తీసుకుపోవాల్సి ఉంది మొక్కలు నాటడంలో ఉన్న ఉత్సాహం వాటిని పెంచడంలో కనిపించడం లేదు. ఇలాంటి సమస్యలను గుర్తించి సరిచేసుకొని ముందుకు పోతే తెలంగాణ తల్లిమెడలో పచ్చలహారం తొడిగినవాళ్ళం అవుతాం.
ఉపసంహారం:
తెలంగాణ పుడమితల్లి పరిరక్షణలో పునీతులయ్యే గొప్ప అవకాశం "తెలంగాణకు హరితహారం" పథకం కల్పిస్తుంది. ఇందుకై ప్రతి ఒక్కరు కంకణబద్ధులై నిబద్ధతతో మొక్కలు నాటే యజ్ఞంలో పాల్గొనేందుకు ప్రతినబూనాలి. అప్పుడే మన తెలంగాణ హరితవర్ణ కాంతులతో గుభాలిస్తది లేకుంటే భవిష్యత్ తరాలకు నిలువ నీడలేని పరిస్థితి దాపురిస్తది.అలాంటి పరిస్థితి రానీయకుండా పచ్చదన పరిరక్షణకై హరితదండులా కదలినప్పుడే తెలంగాణ తల్లికి హరిత కంఠాభరణం తొడుగగలం.

No comments:

Post a Comment